తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నియమితులైన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనర్కు బీఆర్ఎస్ టెక్ సెల్ కీలక సూచన చేసింది. కొత్తగా నియమితులైన డీజీపీ వచ్చిన మొదటి రోజే సోషల్మీడియా కేసుల గురించి ప్రస్తావించారని, సోషల్మీడియా యాక్టివిస్టులు జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారని పేర్కొంది. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా మీదున్న భయంతో అక్రమ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియా కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శించొద్దు అని హైకోర్టు ఇటీవలే విడుదల చేసిన మార్గదర్శకాలు మీకొకసారి గుర్తుచేస్తున్నామని తెలిపింది.
☞ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు ఫిర్యాదుదారుడు స్వయంగా బాధితుడా కాదా అనేది తేల్చుకోవాలి. సోషల్ మీడియా పోస్టుల వల్ల పరువుపోయిందని మూడో వ్యక్తి ఫిర్యాదు చేస్తే చెల్లదు.
☞ ఏదైనా ఫిర్యాదు అందుకున్నా అందులో తీవ్ర నేరారోపణ ఉంటే, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ జరిపి చట్టపరమైన చెల్లుబాటు అంశాలు ఉన్నాయో లేవో తేల్చాలి.. ఉంటేనే కేసు పెట్టాలి.
☞ హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్న పోస్టులపై ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కేసు నమోదు చేయాలి.
☞ ఘాటైన విమర్శనాత్మక రాజకీయ పోస్టులు, ప్రసంగాలపై పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేస్తే చెల్లదు. అవి శాంతిభద్రతలకు ముప్పు చేకూరేలా ఉంటేనే చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలి.
☞ పరువు నష్టం వాటిల్లిందని చెప్పి పోలీసులు నేరుగా కేసులు నమోదు చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని పోలీసులు సూచన చేయాలి.
☞ యాంత్రిక ఆరెస్టులకు వీల్లేదు. సుపీంకోర్టు అర్నేశ్కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో జారీచేసిన మార్గదర్శకాలను పోలీసులు విధిగా అమలు చేయాలి.
☞ రాజకీయ ప్రసంగం లేదా పోస్టు లేదంటే ఇతర సున్నిత వ్యక్తీకరణ అంశాలపై ఫిర్యాదులు/పోలీసుల చర్యలు చట్టబద్ధంగా ఉండాలి. వీటిపై పోలీసులు ఎఫ్ఆర్ నమోదుకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్లాలి.
☞ రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులు పనికిమాలినవని నిర్ధారణకు వస్తే ఆ కేసు దర్యాప్తును మూసేయాలి. దర్యాప్తునకు కారణాలు లేవని పేర్కొంటూ కేసు మూసేయాలి.
సోషల్ మీడియా కేసులు పెట్టేముందు ఈ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోవాలని నూతన పోలీసు బాసులకు విజ్ఞప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ తెలిపింది. లేనిపక్షంలో కోర్టుల నుంచి అక్షింతలు తప్పవని హెచ్చరించింది.
కొత్తగా నియమితులైన @TelanganaDGP గారు, @CPHydCity గారు వచ్చిన మొదటిరోజే సోషల్ మీడియా కేసుల గురించి మీడియాలో ప్రస్తావించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు.
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా మీదున్న భయంతో అక్రమ కేసులు పెట్టాలని పోలీసులపై…
— BRS TechCell (@BRSTechCell) September 29, 2025