హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, ఆ చుట్టుపక్కల తండాల్లో ఈ నెల 11న అర్ధరాత్రి కరెంటు తీసేసి పోలీసులు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు సాగించిన అరాచకంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల గోడు ప్రత్యక్షంగా విన్న తర్వాత పోలీసు వ్యవస్థ అకృత్యాలపై తీవ్రంగా మండిపడింది. లగచర్లకు చెందిన పలువురు బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్ల వద్దకు వెళ్లి తమకు జరిగిన అన్యాయంపై నేరుగా ఫిర్యాదు చేశారు. ఉదయం మానవ హకుల కమిషన్ వద్దకు వెళ్లిన తర్వాత మహిళా కమిషన్ వద్దకు వెళ్లిన బాధితులు.. తమ భూములను అన్యాయంగా గుంజుకుంటున్నారని, తిరగబడిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, అర్ధరాత్రి కరెంటు తీసేసి పోలీసులు తమ గిరిజన బిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించారని కన్నీటి పర్యంతమయ్యారు. అడ్డుకున్న మహిళలపై అర్ధరాత్రి పోలీసులు లాఠీలతో దాడులు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు కేసుల గురించి బాధితులను అడిగారు. దాడి ఎలా జరిగింది? ఎప్పటి నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? అందుకు కారణాలు ఏంటి? ఇంత జరిగినా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే విషయాలన్నీ మహిళా కమిషన్ సభ్యులు బాధితులను అడిగారు. బాధితులు వారికి సవివరంగా సమాధానం చెప్పారు.
భావోద్వేగానికి లోనైన కమిషన్ సభ్యులు
ఫార్మా కంపెనీలు వద్దని, ఈ ఆందోళనలన్నీ దాదాపు 9 నెలల నుంచి జరుగుతున్నాయని.. తమ భూములు కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినా కలిసే అవకాశం ఇవ్వలేదని కమిషన్లకు బాధితులు వివరించారు. మొన్నటి భూ సేకరణ ప్రజాభిప్రాయంపై తమకు సమాచారం లేదని, కలెక్టర్ వస్తారనే సమాచారం లేదని, ముఖ్యమంత్రి అన్నయ్య తిరుపతిరెడ్డి ఎప్పుడు తమ గ్రామాలకు వచ్చినా పోలీసుల బందోబస్తుతోనే వస్తున్నాడని, ఈ సారి అతనితో తాడోపేడో తేల్చుకుందామని తమ బిడ్డలు ఆందోళనలకు సిద్ధమయ్యారని కమిషన్‌కు తెలిపారు. కలెక్టర్‌ను తాము కొట్టలేదని, ఆయన కూడా తనపై దాడి జరగలేదనే విషయాన్ని మీడియా ముందు చెప్పారని గుర్తుచేశారు. ఇన్ని రోజులు ఫార్మా కంపెనీల కోసం సంతకాలు పెట్టించుకునేందుకు తిరుపతిరెడ్డి ఎందుకు దొంగచాటుగా తిరుగుతున్నాడో చెప్పాలని కోరారు.
ఈ నేపథ్యంలో ‘కేసులు పెట్టారా? దెబ్బలు రిమాండ్ రిపోర్టులో ఉన్నాయా?’ అనే విషయాలను కమిషన్ సభ్యులు ఆరా తీశారు. దీంతో బాధితులు సమాధానమిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదన్న విషయాన్ని వివరించారు. తమను పోలీసులు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదని, ఒక వేళ బయట అడుగుపెడితే కొందరు ప్రైవేట్ వ్యక్తులు బైక్‌లు, కార్లలో తమను వెంబడిస్తున్నారని కమిషన్ ముందు ఉంచారు. దీంతో మహిళా కమిషన్ కూడా తమ సభ్యులను అక్కడికి పంపి వాస్తవాలను తెలుసుకొని, బాధ్యులైన పోలీసులు, వారికి సహకరించిన ప్రైవేట్ వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. లగచర్ల బాధితుల దుస్థితిని తెలుసుకొని, వారి గోడు విని, కమిలిపోయిన దెబ్బల వీడియోలు చూసి కొందరు సభ్యులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైనట్టు తెలిసింది.
జాతీయ ఎస్సీ కమిషన్ వద్ద..
మానహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత బాధితులు నేరుగా జాతీయ ఎస్సీ కమిషన్ వద్దకు వెళ్లి లగచర్లలో ఫార్మా కంపెనీల బాధితుల్లో గిరిజనులతో పాటు ఎస్సీలు, బీసీలు ఉన్నారని, అక్కడ అన్ని కులాల పట్ల జరుగుతున్న అకృత్యాలపై స్పందించాలని ఫిర్యాదు చేశారు. కమిషన్ సభ్యులు సైతం లగచర్ల ఘటన, పోలీసుల థర్డ్ డిగ్రీ వివరాలు తెలుసుకున్నారు. బాధితుల పక్షంగా బీఆర్ఎస్ నేత, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ జరిగిన దాడి, అరాచకాలను ఎస్సీ కమిషన్‌కు వివరించారు. తక్షణమే తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసులు పంపిస్తామని కమిషన్ హామీ ఇచ్చింది. రెండు మూడు రోజుల్లో అవసరమైతే కమిషన్ సభ్యులు అక్కడ పర్యటిస్తారని భరోసా ఇచ్చింది.
జాతీయ ఎస్టీ కమిషన్‌కు..
ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్‌ను కలిసి లగచర్ల బాధితులు ఫిర్యాదు చేశారు. వారి బాధను, జరిగిన దారుణాలు ప్రత్యక్షంగా విని ఎస్టీ కమిషన్ సభ్యుడు చలించిపోయారు. ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. విడివిడిగా ప్రశ్నించి పూర్తి వివరాలు రాబట్టారు. బాధితుల్లో ఎక్కువ మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటంపై ఎస్టీ కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి పెడుతుందని హామీ ఇచ్చారు. న్యాయం జరిగే వరకూ బాధితుల పక్షాన కమిషన్ ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే తాను లగచర్లకు వచ్చి మరిన్ని వివరాలు సేకరిస్తానని బాధితులతో చెప్పారు. అప్పటికప్పుడే తెలంగాణ డీజీపీకి, సీఎస్, వికారాబాద్ కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు పంపినట్టు తెలిసింది.
ఆందోళన వద్దు: ఎన్హెచ్ఆర్సీ
ఉదయం నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి బాధితులు తమ గోడు వెలిబుచ్చారు. కమిషన్ చైర్మన్, ఇతర సభ్యులకు ఆ రోజు అర్ధరాత్రి జరిగిన ఉదాంతాన్ని, పోలీసుల అరాచకాలను వివరించారు. బాధితుల గోడు విన్న కమిషన్ సభ్యులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే సీఎస్, డీజీపీ నుంచి వివరణ తీసుకుంటామని చెప్పారు. వీలైతే కమిషన్ సభ్యులను లగచర్లకు పంపిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు సరైన నివేదిక ఇవ్వని పక్షంలో తమ సభ్యులే నివేదికను తయారు చేసి, కమిషన్‌ను అందిస్తారని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన చెందొద్దని ఎన్హెచ్ఆర్సీ భరోసా ఇచ్చింది. ఒక్కో బాధితురాలి నుంచి వివరాలు తీసుకొని.. సుదీర్ఘంగా 40 నిమిషాల పాటు వారి గోడును విన్నది.
ఇంత క్రూరంగా హింసిస్తారా?
‘ఇంత క్రూరంగా హింసిస్తారా? ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. ఏ అధికారం ఉన్నదని పోలీసులు అర్ధరాత్రి మఫ్టీల్లో వచ్చి అరాచకం సృష్టిస్తారు?’ అని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రశ్నించారు. ‘అర్ధరాత్రి ఇండ్లలోకి దూరి అరెస్టులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్లేమన్నా తీవ్రవాదులా? ఉగ్రవాదులా? సెల్‌ఫోన్ టవర్ల నుంచి సిగ్నళ్లు, ఇంటర్నెట్ బంద్ చేసి అరాచకం సృష్టించడం వెనుక ఎవరున్నారు?’ అని మహిళా కమిషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అర్ధరాత్రి కరెంటు తీసేసి, మహిళల ఛాతీలపై కాళ్లు పెట్టి, కుతికలు పిసుకుతూ, ఎదలపై అసభ్యంగా తాకుతూ, ప్రైవేట్ పార్ట్స్, తొడలపై లాఠీలతో కొడుతూ ఎందుకింత దారుణాలకు ఒడిగట్టారో చెప్పాలి’ అని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీని వివరణ కోరతామని తెలిపారు. ‘పోలీసులకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది?’ అని కమిషన్ చైర్పర్సన్ సీరియస్ అయ్యారు. లగచర్ల బాధితులు తమకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూపించారు. అనంతరం ఇలా ఎందుకు జరిగిందని కమిషన్ బాధితులను ప్రశ్నించింది. 20 నిమిషాలు పురుషులు, బాధిత మహిళలతో మాట్లాడిన తర్వాత.. పురుషులను బయటికి పంపి.. కమిషన్ సభ్యులు ప్రత్యేకంగా బాధిత మహిళలతో మాట్లాడారు.
పోలీసులు అర్ధరాత్రి చేసిన అరాచకాన్ని మహిళలు కమిషన్‌కు క్షుణ్ణంగా వివరించారు. ఆ రోజు పోలీసులు వచ్చిన విధానం, గడ్డపారలు పట్టుకొని తలుపులు పగలగొడతామని బెరించిన తీరును వివరించారు. ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అలా ఎందుకు చేశారు? దాని వెనుక ఎవరున్నారు? ఫార్మా విలేజ్ పేరుతో తండాల్లో ఎలాంటి అకృత్యాలు జరుగుతున్నాయనే అంశాలను కమిషన్ సభ్యులు తెలుసుకున్నారు. బాధిత మహిళలతో 35 నిమిషాల పాటు మాట్లాడి, కన్నీళ్లు పెట్టుకున్నవారిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. బాధితులు చెప్పిన వివరాలన్నీ రికార్డ్ చేసుకున్నారు. తక్షణం చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడాలంటూ ఓ సభ్యురాలు క్యాబిన్‌కు వెళ్లారని, బాధితులు చెప్పిన అంశాలపై తక్షణం వివరణ ఇవ్వాలనే ఆదేశాలతో నోటీసులు టైప్ చేయించారని తెలిసింది. అనంతరం ఈ దుర్ఘటనపై వివరణ ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీ, వికారాబాద్ కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు పంపిస్తామని, న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే తామే నేరుగా లగచర్లకు వచ్చి వివరాలు సేకరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.