కార్వాన్, సెప్టెంబర్29: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదపై చేస్తున్న దాష్టీకాలను అడ్డుకొని తీరుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. కార్వాన్‌లోని మూసీ పరీవాహక ప్రాంతమైన దరియాబాగ్లోని పేదల బస్తీలో ఇండ్ల తొలగింపు కోసం అధికారులు మార్కింగ్ చేయగా ప్రజలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆదివారం దరియాబాగ్ బస్తీకి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. పేదలకు లేనిపోని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు పేదల ఇండ్లనే కూల్చుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శమని మండిపడ్డారు. దరియాబాగ్ ప్రజల ఇండ్లపైకి బల్డోజర్లు వస్తే కూల్చకుండా తాము అడ్డుకుంటామని చెప్పారు. ఆయనవెంట బీఆర్ఎస్ నాయకులు ముత్యాల భాస్కర్, పట్లూరి రఘు, యాద శ్రీనివాస్ గుప్తా ఉన్నారు.
ఖైరతాబాద్, సెప్టెంబర్ 29 : పేదలు నివసించే మురికివాడల జోలికి వెళ్లొద్దని హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ అధికారులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ పరీవాహక ప్రాంతా ల్లో జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే వారి భవనాలను కూల్చివేయడం సరికాదని తెలిపారు. గ్రేటర్లో ఎన్నో పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయని, వాటి జోలికి పోకుండా పేదల ఇండ్లను కూల్చివేయడేమిటని ప్రశ్నించారు. ఇండ్లకు రెడ్‌మార్క్ పెట్టడం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. బాధితులకు ముందుగా వసతి కల్పిస్తే మంచిదని సూచించారు.