హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందలాది మంది అమరుల బలిదానాలు, కేసీఆర్ అలుపెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన విషయాన్ని గుర్తుచేశారు. గొప్ప ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణను పాకిస్థాన్ విభజనతో పోల్చడం దుర్మార్గమని ధ్వజ మెత్తారు. గతంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉండి కర్ణాటకలో విలీనమైన ఏడు జిల్లాలపై వివక్ష చూపుతున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రం రాకముందు అవమానించిన బీజేపీ నాయకులు, రాష్ట్రం సిద్ధించాక కూడా తమ ధోరణి మార్చుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేనిలోటు స్పష్టంగా కనిపించిందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వీ సూర్యను గల్లాపట్టి నిలదీసేవారని స్పష్టంచేశారు. తెలంగాణను అవమానిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చోద్యం చూశారని మండిపడ్డారు. వారు తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కూడా మాట్లాడకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. తెలంగాణకు అన్యా యం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటుచేసి ఇబ్బందులు పెట్టే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.