నిజామాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా, స్వచ్ఛందంగా తప్పుకుంటానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సవాల్ చేశారు. ప్రజలను పాలించే వ్యక్తులకు సహృదయం, పరిపాలనా సమర్థత ఉండాలని చెప్పారు. అలాంటి నాయకుడు వస్తేనే దేశం బాగుపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్లుగా ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. మంగళవారం ఆయన బాన్సువాడలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల తీరును, వారి మాటలను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటననూ సీఎం కేసీఆర్ కుటుంబానికి అంటగట్టి తప్పుడు ఆరోపణలతో నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తమ తీరు మార్చుకోవాలని సద్విమర్శతో కూడిన ఆరోపణలు చేయాలని హితవు పలికారు. లేదంటే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన పరిపాలన సాగుతున్నదని ప్రశంసించారు. కండ్లుండి చూడలేని, చెవులుండి వినలేని వారు రాజకీయ పబ్బం గడిపేందుకు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పేపర్ లీక్‌తో కేటీఆర్‌కు ఏమి సంబంధం?
టీఎస్పీఏస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో పొరపాటు జరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం అంగీకరించి యాక్షన్ తీసుకున్నదని స్పీకర్ పోచారం వివరించారు. తప్పకుండా దొంగలకు శిక్ష పడుతుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. అనవసరంగా దీనిని కూడా కేసీఆర్ కుటుంబానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది స్వార్థంతో లీకేజీలు చేసి దొరికారని, మంత్రి కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయాలని ప్రశ్నించారు.
బండి, రేవంత్ జాగ్రత్త
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. నోటికొచ్చింది చెప్పడం, నొటికొచ్చింది మాట్లాడటం మంచిది కాదన్నారు. మత విద్వేషాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ‘నాకు ఎవరిపై కోపం లేదు. మీ మాటలే నన్ను బాధిస్తున్నాయి. అని బండి, రేవంత్‌ను ఉద్దేశించి చెప్పారు. కరీంనగర్‌కు ఎంపీగా బండి సంజయ్ చేసిందేమీ లేదని, రూపాయి లాభం జరగలేదని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడితే మొదట స్పందించింది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఎందుకు ముందే స్పందించలేకపోయారని ప్రశ్నించారు. నాయకత్వమంటే కేసీఆర్ లాగా ఉండాలని హితవు చెప్పారు.
వేధింపులకు కేసీఆర్ లొంగరు
ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా ఇబ్బందికి గురి చేస్తున్నారని స్పీకర్ పోచారం మండిపడ్డారు. ఆడబిడ్డను కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగా వేధిస్తున్నదని దుయ్యబట్టారు. 40 గంటలపాటు విచారణ పేరుతో వేధించడం సరైనదేనా? అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఆడబిడ్డలను ఇన్ని గంటలపాటు విచారణ జరుపుతారా? అని ఆవేదన వ్యక్తంచేశారు. కవితను వేధించడం ద్వారా తనను రాజకీయంగా దెబ్బకొట్టాలని చూసే వారికి కేసీఆర్ లొంగరని స్పష్టంచేశారు.