హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటి అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించి పబ్బం గడపాలని కాంగ్రెస్ సర్కారు చూస్తున్నదని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా నాలుగు గోడల మధ్య ఉండదని, ప్రజల మధ్యే తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు చెప్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆ సిద్ధాంతం నిరుద్యోగులకు వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు.
తమ నిర్ణయాలు ప్రజల్లోనే ఉంటాయని చెబుతున్న సరారు ఓయూలో, దిల్‌సుఖ్‌నగర్‌లో, అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు చేస్తున్న నిరసన ప్రదేశాలకు ఎందుకు వెళ్లటంలేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అశోక్‌నగర్, చికడపల్లి చుట్టూ తిరిగినవారు ఇప్పుడెందుకు వెళ్లరని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి వెళ్లకపోయినా కనీసం ఓ మంత్రిని, ఎమ్మెల్యేనైనా ఎందుకు పంపటంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెక్రటేరియేట్ ముట్టడికి పిలుపునిస్తే వందలాది మంది పోలీసులను రప్పించారని, నిరుద్యోగులేమైనా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారు.