హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): మూడు దశాబ్దాల నాటి పంచాయతీ లేఔట్లపై ఇప్పుడు నిషేధం విధించడమేమిటని బీఆర్ఎస్ సోషల్ మీ డియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే ఐసీయూలో ఉన్న తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగాన్ని శ్మశానానికి పం పే కార్యక్రమం నడుస్తున్నదా? అని ప్ర శ్నించారు. హెచ్ఎండీఏ పుట్టక ముందు చేసిన లేఔట్లపైనా ఇప్పుడు నిషేధం విధించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి జీపీ లేఔట్లు ఎందుకు టార్గెట్‌గా మారాయని ప్రశ్నించారు. ‘2007, 2012లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్), బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (బీఆర్ఎస్) తెచ్చి, జీపీ లేఔట్ ప్లాట్ల రెగ్యులరైజేషన్ పేరిట వేల కోట్లు దండుకొన్నదని ధ్వజమెత్తారు. ఇప్పుడు వాటిపైనే నిషేధం అంటే ఆ రెగ్యులరైజేషన్ పట్టాలు చిత్తు కాగితాలా? అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఈ నిషేధిత జాబితా తయారుచేసిందని, ఈ జాబితాలో అన్ని జీపీ లేఔట్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఇప్పటికే ఇండ్లు కట్టుకొని లోన్లు తీసుకున్న వారి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఆగమైతున్న తెలంగాణను రక్షించండి.. అని సతీశ్‌రెడ్డి కోరారు.