హైదరాబాద్ : కాంగ్రెస్ వేధింపు రాజకీయాలకు నిరసనగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త శాంతియుత ఆందోళనలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) పిలుపునిచ్చారు. సిట్( SIT ) విచారణకు హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCT ) స్పష్టంగా చెప్పినా కూడా సిట్ అధికారులు నందినగర్‌లో గోడకు నోటిసులు అంటించడం దారుణమని అన్నారు. ఇది కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.
ఒక్కడిగా రాష్ట్ర సాధనకు బయలు దేరి అందర్నీ ఏక తాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్ష సాధింపులను ప్రపంచమంతా చూస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసునని, రాష్ట్ర మంత్రులు కూడా అక్కడికి వెళ్లి మేడారం జాతరకు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు.
సిట్ అధికారులు మాత్రం నంది నగర్ నివాసానికి వచ్చి గోడకు నోటిసు అతికించి కించపరిచారని తెలిపారు. సిట్ విచారణపై కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే విచారణ పై స్టే వచ్చేదని అలా కాకుండా చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతున్నారని వెల్లడించారు.