Warangal | ఓరుగల్లు సాక్షిగా రైతు రణగర్జన..సదస్సు సక్సెస్‌తో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు
నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్‌కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది.
- రేవంత్ రైతు వ్యతిరేక విధానాలను చీల్చిచెండాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఎర్రటి ఎండలోనూ సంగ్రామ సదస్సుకు పోటెత్తిన రైతన్న
- విరగపూసిన గులాబీ వనం
- సదస్సు సక్సెస్‌తో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు
వరంగల్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్‌కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది. రెండున్నరేండ్లుగా తెలంగాణ రైతన్నను అరిగోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ‘సంగ్రామ’భేరి మోగించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్‌ను ‘ఇక ఉప్పుపాతరేసుడే’ అని బుధవారం వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుతో బీఆర్ఎస్ తేల్చిచెప్పింది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు, వాటిల్లో భాగమైన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి సర్కార్ 850 రోజులైనా వాటి ఊసెత్తకపోవడమే కాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న బుల్డోజర్ పాలనపై ప్రజాచైతన్యాన్ని కూడగట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైందని, అందులో భాగంగానే రైతు సంగ్రామ సదస్సులో రేవంత్ సర్కార్ వైఖరిపై కేటీఆర్ ఊచకోత ప్రసంగమే నిదర్శనంగా నిలిచింది. ఇప్పటిదాకా ఆయా సభలు, సదస్సుల్లో కేటీఆర్ ప్రసంగాలకు.. రైతు సంగ్రామ సదస్సులో ఆయన చేసిన ప్రసంగానికి మధ్య స్పష్టమైన తేడా కనిపించింది.

అర్బన్ అట్రాక్టివ్ నరేటివే కాదు.. రూరల్ మాసెస్‌ను కేటీఆర్ అద్భుతంగా అడ్రస్ చేస్తారనే విషయం ఈ సదస్సులో ఆయన చేసిన ప్రసంగంపై సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ‘ఎదుటివారు బూతులు తిడుతుంటే మనం నీతులు చెప్పుకుంటూపోతే కుదరదు’ అనే విషయాన్ని ‘మా రామన్న’ తన ప్రసంగం ద్వారా చెప్పిండు అని బీఆర్ఎస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే కాకుండా రైతు డిక్లరేషన్ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతాంగానికి హామీలు ఇస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలను రైతుల ముందు విజువలైజ్ చేయడమే కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిజమా? కాదా? ఇప్పుడు అమలు అవుతున్నాయా? లేదా? అనే విషయాలను రైతులతోనే చెప్పించారు. ‘బతిమిలాడి తెచ్చుకున్న జనం అయితే చడీచప్పుడు కాకుండా కూర్చుంటారు. బతుకుపోరాటంతో నలిగి బరిగీసి కొట్లాడేందుకు సిద్ధమైనవాళ్లే బదులిస్తారు’ అన్నట్టుగానే రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై తిరుగుబాటు చేసేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అడిగిన అన్ని ప్రశ్నలకు రైతుల నుంచి వచ్చిన స్పందనే అందుకు నిదర్శనంగా కనిపించింది.

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ నిప్పుల ఉప్పెన
కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ నిప్పుల ఉప్పెనై విరుచుకుపడ్డారు. రేవంత్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. రాహుల్‌గాంధీ తెలంగాణ రైతాంగాన్ని దగాచేశారని దుయ్యబట్టారు. ‘రాహుల్‌గాంధీ.. ఎక్కడున్నది నీ డిక్లరేషన్, ఎక్కడ దాక్కున్నవ్’ అని కేటీఆర్ నిలదీస్తున్నప్పుడు సదస్సు ప్రాంగణం ‘ఢిల్లీలో దాక్కున్నడు’ అంటూ ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించడం గమనార్హం.

డిక్లరేషన్ ఇచ్చి లక్షలాది మంది రైతులను మోసం చేసిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఫొటోను.. రైతు డిక్లరేషన్ పత్రాలను రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్ల ముందు అంటించి.. వాటికింద ‘దొంగలున్నారు.. జాగ్రత్త’ అని రాసిపెట్టాలని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తున్నప్పుడు ‘దొంగలు.. వాళ్లు దొంగలు’ అని నినాదాలు మిన్నంటాయి. ‘కాలంబు రాగానే కాటేసి తీరాలె’ అని ప్రజాకవి కాళోజీ కవితా పాదాలు కేటీఆర్ వల్లెవేస్తుంటే ‘కాంగ్రెస్‌ను ఇగ ఇయ్యర మయ్యర వాయించుడే’ అని రైతులు నినదించారు. అలాగే, ‘రైతుబంధు ఎగ్గొట్టేందుకు మేమేమైనా దివానా గాళ్లమా?’ అనే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల వీడియో ప్లేచేసి ‘ఇప్పుడు ఏమనాలి? అని కేటీఆర్ ప్రశ్నించగానే.. ‘అన్నోడే..దివానా.. రేవంతే దివానా’ అని రైతులు బదులివ్వడం గమనార్హం.

ధూం..ధాం.. పాటల జాతర
రైతు సంగ్రామ సదస్సులో పాటలు జాతర చేశాయి. దుమ్మురేపాయి. ‘కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే’, ‘కాంగ్రెస్ దొంగలు.. మా చేన్లన్న దిష్టిబొమ్మలు’, ‘బుల్డోజర్ల ముఖ్యమంత్రి.. భూకబ్జాల ముఖ్యమంత్రి.. నీపాలన పాడుగానురో.. నువు మా పాపం తగిలి పతనమైతవో’ అంటూ కళాకారులు పాడిన పాటలతో సదస్సును మైమరపించాయి. ఇక ‘నాపేరే తెలంగాణ భూమి.. నాగొంతెండి పోతున్నదేమి?’ అనే పాటతో కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఉద్దేశపూర్వకంగా పడావు పెట్టిన తీరుపై రైతుల్ని ఆలోచింపజేసింది. కవి, గాయకులు మిట్టపల్లి సురేందర్, మధుప్రియ, సందీప్ తదితర కళాకారులతో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గొంతు కలిపారు.

ప్రతిధ్వనించిన జై కిసాన్.. ప్రతినబూనిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రసంగాన్ని ‘జై కిసాన్’ నినాదంతో ప్రారంభించారు. కేటీఆర్ పోడియం వద్దకు రాగానే రైతులు, సదస్సు ప్రాంగణంలో ఉన్నవాళ్లు.. వేదిక మీదున్న నాయకులు ‘జై కిసాన్.. జై తెలంగాణ అంటూ గొంతు కలిపారు. రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో మృతిచెందిన దాదాపు వెయ్యి మంది రైతు మరణాలకు సదస్సు ఘన నివాళి అర్పించింది. మరోవైపు రాష్ట్రంలోని రైతాంగానికి అన్నివేళలా బీఆర్ఎస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా, రేవంత్ సర్కార్ మెడలు వంచేదాకా విశ్రమించని, విరామం ఎరుగని పోరాటం చేస్తామని గులాబీ శ్రేణుల పక్షాన ప్రతినబూనారు. సదస్సు ప్రారంభానికి ముందు కేటీఆర్ హన్మకొండలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సదస్సు ప్రాంగణానికి కొద్దిదూరానికి చేరుకొని అక్కడి నుంచి సదస్సు సభావేదిక వద్దకు ఎడ్ల బండిపై వచ్చారు. వేదికకు ఇరువైపులా మక్క కంకులు, వరి గొలుసులు, వేదిక ముందు మక్క కంకులతో అలంకరించిన బండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎర్రటి ఎండలోనూ పోటెత్తిన రైతన్న
అసలే ఎండాకాలం ఆపై మే మాసం. ఉదయం నుంచే భానుడి ప్రతాపం గంటగంటకూ పెరుగుతున్న వేడి. ఉదయం 11 గంటల నుంచి 2 గంట వరకు పగటిపూట రోడ్లమీద కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొన్నది. ఇటువంటి వాతావరణంలో వేలాది మంది రైతులతో సదస్సు నిర్వహించడం.. అదీ 42 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఆరుబయట ఒక టెంట్ వేసి సదస్సు నిర్వహించడం, అందునా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పిలిస్తే ఎవరొస్తారు? కచ్చితంగా బీఆర్ఎస్ సదస్సు ఫెయిల్ అవుతుంది? అని రేవంత్ సర్కార్ భావించింది. కానీ, సర్కార్ అంచనా తప్పని తేలిపోయింది.
ఓరుగల్లు గడ్డమీద ఎర్రటి ఎండలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సుకు రైతాంగం పోటెత్తింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా రైతులు సంగ్రామ సదస్సుకు తరలివచ్చి రేవంత్ సర్కార్ అంచనాలు తప్పని తేల్చిచెప్పాయి. ఇదే వరంగల్ గడ్డ మీద ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రైతుమేళా ప్రాంగణంలో కూలర్లు, ప్రయాణానికి ఏసీ బస్సులు, తొవ్వల సాదర ఖర్చులు చేస్తాం.. అన్నితీర్ల అర్సుకుంటాం అని ఊరూరా వాగ్దానం చేసినా మేళా ప్రారంభించేందుకు మంత్రులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సదస్సును విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చిన తీరుకు నిఘా వర్గాలే ఆశ్చర్యానికి లోనయ్యాయి. పార్కింగ్ స్థలాలకు చాలా దూరం ఆవల వాహనాలను నిలిపివేయడం, కొన్ని రూట్లలో అయితే ట్రాఫిక్‌జామ్ చేయడం, నిర్దేశిత సమయంలో క్రమబద్ధీకరణ చేయకుండా చేతులెత్తేయడం వంటి ప్రతికూల పరిస్థితులు కల్పించి తమ సదస్సును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విఫలం చేయాలని చూసినా విజయవంతమైందని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి.
రైతు సంగ్రామం

రైతు సంగ్రామ సభలో కరవాలం చూపుతున్న కేటీఆర్
కేసీఆర్ రావాలె..

సభలో పోస్టర్ ప్రదర్శిస్తున్న రైతు
గళమెత్తిన రసమయి

రైతు సంగ్రామ సభలో పాట పాడుతున్న రసమయి బాలకిషన్
నాగలి చేతబట్టి..

కేటీఆర్‌కు నాగలి బహూకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

