ఆమనగల్లు, ఫిబ్రవరి 13: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్టు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించే రైతు నిరసన దీక్షకు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి జన సమీకరణ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఆమనగల్లు పట్టణంలో గురువారం రైతు నిరసన దీక్ష నిర్వహించే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాన్ని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, మాజీ జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, నేనావత్ అనురాధ స్థానిక నాయకులతో కలిసి స్థలాన్ని పరీశీలించారు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ రైతు దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.