హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): నాందేడ్‌లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ అనుకొన్న దానికన్నా విజయవంతమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులతోపాటు మన రాష్ట్ర నాయకులు, గులాబీ శ్రేణులు సభ సక్సెస్ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు. తొలిసారి తెలంగాణ వెలుపల జరిగిన బీఆర్ఎస్ సభ కోసం నాందేడ్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ను చూసేందుకు ఎంతోమంది రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సభ విజయం సాధించడమే కాకుండా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని, జాతీయస్థాయిలో అనూహ్య స్పందన వస్తుందనడానికి ఈ సభ నిదర్శనమని అన్నారు. సీఎం కేసీఆర్‌పై అభిమానం చాటిన బీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు, వృద్ధులు, మహిళలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.