మిర్యాలగూడ, సెప్టెంబర్ 2: కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న అలసత్వంతోపాటు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసరరావు నేతృత్వంలో జరుగనున్న ఈ మహాధర్నాకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ధర్నా నిర్వహణకు పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో చేపట్టిన ఏర్పాట్లను మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసరరావు, యువ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ బుధవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్నా నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికిపైగా రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నట్టు చెప్పారు.