హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదలైన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల జైత్రయాత్ర బుధవారం నాటికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను పూర్తి చేసింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 15న హుస్నాబాద్‌లో సమరశంఖం పూరించగా, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట సభలు నిర్వహించి ఎన్నికల హీట్ పుట్టించారు. బుధవారం జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల సభలకు హాజరై, కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బీఆర్ఎస్ రూపొందించిన సమరశంఖారావంలో నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనే కార్యాచరణ సిద్ధం చేశారు. అందులో భాగంగా దసరా ముందు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి చేశారు. దసరా పండుగ తర్వాత తిరిగి ఈ నెల 26 నుంచి తిరిగి గులాబీ బాస్ సభల్లో పాల్గొననున్నారు.