హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28, (నమస్తే తెలంగాణ): మూడురోజుల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన జూన్ 1న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కోరింది.
అమరవీరులకు నివాళిగా గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు నిర్వహించనున్న ఈ ర్యాలీలో సుమారు 500 మంది పాల్గొంటారని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆ లేఖలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన వారు ఆ లేఖను కమిషనర్‌కు అందజేశారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే ఈ ర్యాలీని ప్రశాంతంగా జరుపుకుంటామని తెలిపారు. అమరుల త్యాగాలను గౌరవించడం, తెలంగాణ పౌరుల్లో ఐక్యతను చాటడమే ఈ ర్యాలీ ఉద్దేశమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.