Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు’ కల్పించాలన్న నినాదాన్ని సీఎం కేసీఆర్ ఆచరణలో చూపెట్టారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభు త్వం.. వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తున్నది. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యమిస్తూ.. వారి జీవితాల్లో నిర్మాణాత్మక, గుణాత్మకమైన మార్పుకు ఆలంబనగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆడబిడ్డల శ్రేయస్సునే లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతున్నది. రేషన్ కార్డయినా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకమైనా, కల్యాణలక్ష్మి/షాదీముబారక్, దళితబంధు చెక్కులైనా ఆడబిడ్డ పేరు మీదనే అందిస్తుండటం విశేషం.
రాజకీయాల్లో సగం రిజర్వేషన్
ఒకప్పుడు డబ్బు, పలుకుబడి ఉంటే తప్ప మహిళలకు రాజకీయంగా అవకాశాలు దక్కేవి కావు. కానీ, తెలంగాణ ప్రభుత్వం నామినెటెడ్ పోస్టులతోపాటు పంచాయతీలు, మున్సిపాల్టీల్లోనూ సగం స్థానాలను మహిళలకే కట్టబెట్టింది. దీంతో ఆయా పదవుల్లో 67 వేలకుపైగా మహిళలు కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పీఠాలను సైతం మహిళలకే కట్టబెట్టారు సీఎం కేసీఆర్.
ఉన్నత విద్య, ఉత్తమ ఉపాధి
తెలంగాణలో మహిళలకు విద్యావకాశాలు ఎంతో మెరుగయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను నెలకొల్పింది. తద్వారా కార్పొరేట్‌కు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ఉపాధి, ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నది. బాలికలకు విద్యతోపాటు స్వశక్తితో ఎదిగేందుకు వీలుగా ఎంబ్రాయిడరీ, అల్లికలు తదితర వృత్తుల్లో శిక్షణ అందిస్తున్నది. షీటీముల ద్వారా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే తుంటరి మూకల ఆట కట్టిస్తున్నది. గృహహింసకు గురవుతున్న వారికి సఖి సెంటర్ల ద్వారా పునరావసం కల్పిస్తూ న్యాయపరమైన హక్కులను కాపాడటంలో ముందుంటున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాల్లో 25-35% మహిళలకే కేటాయించింది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రత్యేకంగా వీహబ్‌ను స్థాపించింది. దీని ద్వారా సుమారు నాలుగువేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లబ్ధిపొందారు. సుమారు 300 స్టార్టప్‌లకు మద్ధతు లభించింది.
తెలంగాణలో మహిళా సాధికారతకు తోడ్పాటునందిస్తున్న కార్యక్రమాల్లో మచ్చుకు కొన్ని..
తెలంగాణలో బాలికలు, మహిళల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన విద్యాసంస్థలు
డిగ్రీ కళాశాలలు : 57
వొకేషనల్ కాలేజీలు : 24
ఎక్స్‌లెన్సీ సెంటర్లు : 16
గురుకులాలు : 56
ఆర్మ్‌డ్‌ఫోర్స్ కళాశాల : 1
ఐదేండ్ల లా కళాశాల : 1
మహిళావర్సిటీ : 1