హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో కరువు తాండవిస్తున్నదని, ప్రజలకు భరోసా ఇచ్చే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. వానలు లేక రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీళ్లు దొరకని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. విద్యుత్తు సరఫరాలో అప్రకటిత కోతలు అధికమయ్యాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రవిచంద్ర పాల్గొని రాష్ట్ర ప్రజల డిమాండ్లను వినిపించారు.
సమావేశం అనంతరం ఎంపీ రవిచంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విద్యుత్తు కొరతతో హైదరాబాద్‌లోనూ కోతలు విధిస్తున్నందున, బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కోరారు. కేసీఆర్ 13 ఏండ్ల పోరాటం ఫలితంగా తాడిచర్ల -2 బొగ్గు గనిని సింగరేణి సంస్థకు అప్పగించారని చెప్పారు. ప్రైవేట్ పరిధిలోని కోయగూడెం-3, సత్తుపల్లి-3, శ్రావణపల్లితోపాటు పర్యావరణ అనుమతులు ఇచ్చి గోలేటి, మణుగూరు, పూసపల్లి, మాదారం గనులను సింగరేణి సంస్థకు బదలాయించాలని డిమాండ్ చేశారు.
తద్వారా బొగ్గు ఉత్పత్తితోపాటు సంస్థకు లాభాలు కూడా పెరుగుతాయని వివరించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలి కేంద్ర ప్రభుత్వం గోదావరి నీళ్లను బనకచర్లకు తరలించడానికి అనుమతులిస్తూ, తెలంగాణలోని వార్ధా, సీతమ్మ, సమ్మక-సారలమ్మ సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేయకపోవడం విచారకరమని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ సీసీఐ కర్మాగారాన్ని పునరుద్ధరించడంతోపాటు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్ట రీ, బయ్యారంలో స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయాలని వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఆదిలాబాద్, మామునూరు, కొత్తగూడెం విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవం తం చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపాలని కోరారు. తెలంగాణకు ఐఐఎం మంజూరు చేయాలని, హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.