BRS | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఏసీబీ విచారణకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించకపోవడంపై పలువురు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేయకుండా తప్పుడు స్టేట్మెంట్ను సృష్టించేందుకే ఈ కుట్రచేశారని ధ్వజమెత్తారు. ఏసీబీ పిలవగానే స్వచ్ఛందంగా వెళ్లిన కేటీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్‌రెడ్డి సర్కార్ ఇలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చేతిలో తోలుబొమ్మలా ఏసీబీ పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతి అసలే లేని ఈ కేసులో ఏదో ఒకరకంగా కేటీఆర్‌ను జైలుకు పంపాలని సీఎం రేవంత్‌రెడ్డి పన్నాంగం పన్నుతున్నారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి కాదు రివేంజ్రెడ్డి: మహమూద్ అలీ
సీఎం పేరు రేవంత్‌రెడ్డి కంటే రివేంజ్రెడ్డి అని పెట్టుకుంటే సరిపోతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనల మేరకే నగ దు బదిలీ జరిగిందని, ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురిచేయాలనే కుట్రలో భాగంగానే కేటీఆర్‌పై కేసు నమోదుచేశారని విమర్శించారు.
లగచర్ల నుంచే పతనం షురూ : గువ్వల బాలరాజు
లగచర్లలో లంబాడీ రైతులను వేధించిన నాటి నుంచే కాంగ్రెస్ వినాశనం మొదలైందని అచ్చంపేట మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు తేల్చిచెప్పారు. కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టడంతో రేవంత్ సర్కార్ మరింత ప్రజాగ్రహానికి గురైందని తెలిపారు. న్యాయవాదితో సహా వెళ్లిన కేటీఆర్‌ను అడ్డుకోవడం ప్రజలను డైవర్ట్ చేసేందుకేనని చెప్పారు.
రేవంత్‌రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్: పల్లె రవికుమార్
రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి 12 వేలకు తగ్గించడంతో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామనే అక్కసుతోనే సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ విమర్శించారు. కాంగ్రెస్ మోసాలను బట్టబయలు చేస్తున్నారనే కేటీఆర్‌ను జైలుకు పంపేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. విచారణకు న్యాయవాదిని తీసుకెళ్తే ఏసీబీ ఎందుకు అభ్యంతరం తెలుపుతుందని ప్రశ్నించారు.
అవినీతి ఎక్కడిది: గజ్జల నగేశ్
ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి ఎక్కడ జరిగిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేశ్ ప్రశ్నించారు. అవినీతి అన్నదే లేకున్నా కేటీఆర్‌పై రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి కేసు నమోదు చేయిం చి వేధిస్తున్నాడని విమర్శించారు. అభివృద్ధి చేయడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డిది పైశాచికానందం: విజయ్‌కుమార్
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ ఆరోపించారు. పాలన చేతగాకే తప్పుడుమార్గంలో వెళ్తున్నారని విమర్శించారు.