హైదరాబాద్, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్.. బోగస్ అని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శాసనమండలి మీడియా హాలులో మంగళవారం బీసీ నేతలతో సమావేశమై బీసీ డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలపై ఆయన సమాలోచనలు జరిపారు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాలనూ మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీలనూ వంచించే ఎత్తులు వేస్తున్నదని ధ్వజమెత్తారు. న్యాయస్థానాల తీర్పులు, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఎగ్గొట్టే కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. బీసీలను బోల్తా కొట్టించాలనే కాంగ్రెస్ పార్టీ కుయుక్తులను ఎప్పటికప్పుడు ఎండగట్టి, బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, జోగు రామన్న, ఎల్ రమణ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పి ఏ ఒకటీ అమలు చేయడం లేదని విమర్శించా రు. 42% బీసీ రిజర్వేషన్లతోపాటు బీసీలకు కాంగ్రెస్ సరార్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేసే వరకు ప్రభుత్వం వెంటపడతామని హెచ్చరించారు. సమావేశంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాసర్, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు వీ ప్రకాశ్, జూలూరు గౌరీశంకర్, ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, నాగేందర్‌గౌడ్, పుటం పురుషోత్తమరావు, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.