హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని దక్షిణ మధ్య రైల్వే (ఏస్సీఆర్) పరిధిలో ఉన్న మహబూబాబాద్‌కు మంజూరైన మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ రైల్వే డిపోను తక్షణమే ప్రారంభించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో తన సహచర సభ్యులైన కేఆర్ సురేశ్‌రెడ్డి, దీవకొండ దామోదర్‌రావు, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్ చాంబర్లో బుధవారం సాయంత్రం రైల్వే మంత్రితో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెగా ఫ్రైట్ ప్రాజెక్ట్ రైల్వే అంబ్రెల్లా వర్ కింద రూ.908.15 కోట్ల అంచనా వ్యయంతో అధికారికంగా మంజూరు చేసిన విషయాన్ని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సదుపాయం భారతీయ రైల్వేకు వ్యూహాత్మక అవసరమని, ఇందులో ఫ్రైట్ రోలింగ్ స్టాక్ కోసం పీరియాడిక్ ఓవర్ హాలింగ్, రెగ్యులర్ ఓవర్ హాలింగ్, సిక్లైన్ రైలు తనిఖీ సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాలోని అనంతారంలో 409.01 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడానికి ఇప్పటికే చర్యలు చేపట్టిందని పేరొన్నారు. అవసరమైన భారీ మౌలిక సదుపాయాలకు అనువుగా, కొండ, మైదాన ప్రాంతాలు రెండింటినీ కలిగి ఉన్న స్థల ప్రణాళికను సిద్ధం చేసినట్టు వివరించారు.
‘మెగా ఫ్రైట్’ ప్రాజెక్ట్ ఏర్పాటులో జాప్యం జరిగితే మహబూబాబాద్ ప్రాంత యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతోపాటు సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు అందకుండాపోతాయని బీఆర్ఎస్ ఎంపీల బృందం ఆవేదన వ్యక్తంచేసింది. పెండింగ్‌లో ఉన్న పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేయాల్సిందిగా వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ సైట్లో క్షేత్రస్థాయి అమలు, పునాది పనులను వెంటనే ప్రారంభించేలా రైల్వేబోర్డును, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను ఆదేశించాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాజెక్టును ప్రగతికి చిహ్నంగా ఎదురుచూస్తున్నారని, ఈ ప్రాజెక్టు త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్న ఆశాభావంతో ఉన్నారని చెప్పారు.
కొత్తగూడెం త్వరలోనే జాతీయస్థాయి రైల్వే డివిజన్, లాజిస్టిక్స్ హబ్‌గా గుర్తింపు పొందుతుందని తాము విశ్వసిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎంపీల బృందం ఈ సందర్భంగా వెల్లడించింది. కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్ దాదాపు వందేడ్ల చరిత్ర కలిగి ఉన్నదని, సింగరేణి బొగ్గు రవాణాలో దేశ ఫ్రైట్ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నదని, కొత్తగూడెం రైల్వే కారిడార్ ఐదు రాష్ట్రాలను కలుపుతున్న ఒక ప్రధాన కనెక్టివిటీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటుందని కేంద్ర మంత్రి గుర్తించినట్టు ఎంపీ వద్దిరాజు తెలిపారు. రైలు, రోడ్డు మార్గాలను సమన్వయం చేస్తూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలను కలుపుతూ ఈ కారిడార్ లాజిస్టిక్స్, పరిశ్రమలు, ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్పేర్కొన్నట్టు తెలిపారు.