BRS Party | పార్లమెంట్ ఎన్నికలకు భారత్ రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించబోతున్నది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర కీలక నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్నాయి. తొలి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతున్నాయి.
సంక్రాంతి పండగ నేపథ్యంలో మూడు రోజులు విరామం అనంతరం మళ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో సన్నాక సమావేశాలు షురూ అవుతాయి. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి సమావేశాలు జరుగుతాయి. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ , 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్ , 20న మల్కాజ్గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా కీలక నేతలు సమావేశాలకు హాజరవనున్నారు.
తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.