హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికల వేళ ప్రచారం చేసుకొనేందుకు బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నారేగానీ.. దేశ ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా అందులో లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై వారు గురువారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పూర్తిగా నిరాశ, నిస్పృహలతో కూడుకున్న బడ్జెట్‌గా అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగం సొంత డబ్బాలా ఉన్నదని, ఏ వర్గాన్నికూడా సంతృప్తి పర్చలేదని విమర్శించారు. ఆశలు రేకెత్తించే బడ్జెట్ ప్రవేశపెడతారని భావిస్తే.. నిరాశలోకి నెట్టే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదని అన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరుకున్నాయని, వాటిని నియంత్రించే దిశగా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావని లేదని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే ప్రణాళికేది లేదని, ఉద్యోగాల ప్రస్తావని జాడే లేదని, రైతులు, వ్యవసాయానికి కూడా ఉపయోగపడే విషయాలేవీ బడ్జెట్లో లేవని విమర్శించారు.
మధ్యంతర బడ్జెట్లో సామాన్యులకు, ఉద్యోగులకు ఎలాంటి ఊరట లేదని, పన్నుల విషయంలోనూ ఎలాంటి మార్పు లేదని చెప్పి అన్ని వర్గాలను ఉసూరుమనించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ పన్నుకు సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్ సవరణ చేయలేదని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణ చేస్తారని ఐదేండ్ల నుంచి ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈసారికూడా వారికి నిరాశే ఎదురయ్యిందని విచారం వెలిబుచ్చారు. గత పదేండ్లలో ప్రత్యక్ష పన్నుల రాబడి మూడింతలు పెరిగినట్టు చెప్పారని, ఆ రాబడిని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదని విమర్శించారు
పీఎం కిసాన్ సాయం పెంచుతారని రైతులు ఆశించారని, కానీ ఐదేండ్ల నుంచి రూ. 6 వేలు మాత్రమే ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. రైతుల ఖర్చులు పెరిగాయి.. పెట్టుబడి పెరిగింది.. ఆ మొత్తాన్ని పెంచుతారనుకుంటే రైతులకు నిరాశే ఎదురయ్యిందని విమర్శించారు. వ్యవసాయ రంగానికి తక్కువ కేటాయింపులు (రూ.1.27 లక్షల కోట్లు) చేసి రైతులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యుడిపై భారం తగ్గించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 15 లక్షలు వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, అది ఇప్పటికీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే కవరేజీ రూ. 10 లక్షలకు పెంచుతారని పేదలు ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఎప్పటిలాగే తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపారని పేర్కొన్నారు.