హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) సేవలను తక్షణమే విస్తరించి, ఆధునీకరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్) కింద ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. నగర జనాభా, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారుల రాకపోకలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయని ఎంపీ తెలిపారు.ఎంఎంటీఎస్ ఫేజ్-2 పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఐటీ కారిడార్లు, వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాలకు ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. గిరిజన , వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని జాతీయ రహదారుల అనుసంధానతపై ఎంపీ వద్దిరాజు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీ సమాధానమిచ్చారు. ఎల్‌డబ్ల్యూఈ ప్రాంతాల రోడ్డు అనుసంధాన పథకం కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు రూ. 2,170 కోట్లు, అలాగే గిరిజన ఉప ప్రణాళిక ద్వారా రూ. 1,711 కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు మంత్రి వివరించారు.
నిజామాబాద్ పట్టణం వెలుపల ప్రతిపాదించిన రైల్వే బైపాస్ లైన్ అలైన్మెంట్ వల్ల గూపన్పల్లి, పాంగ్రా గ్రామాల వ్యవసాయ భూములతోపాటు అశోక్‌నగర్ ఎన్క్లేవ్ నివాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఎంపీ వద్దిరాజు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, దానికి ప్రత్యామ్నాయంగా ఆర్మూర్ – డిచ్పల్లి అనుసంధాన రైలు మార్గాన్ని పరిశీలించాలని కోరారు. ఈ ప్రత్యామ్నాయ మార్గం వల్ల 20కి పైగా గ్రామాలకు రైలు సదుపాయం కలుగడమే కాకుండా, ప్రతిపాదిత జక్రాన్‌పల్లి విమానాశ్రయానికి అనుసంధానత పెరుగుతుందని చెప్పారు.
కేరళ రాష్ట్రం అధికారిక పేరును మలయాళ భాష, సంసృతి , చారిత్రక గుర్తింపును ప్రతిబింబించేలా ‘కేరళం’గా మార్చే రాజ్యాంగ సవరణ బిల్లు 2026కు బీఆర్ఎస్ మద్దతునిస్తున్నట్టు తెలుపుతూ ఆ రాష్ట్ర ప్రజలకు ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రతిపాదనలకు అనుగుణంగా కేరళ శాసనసభ చేసిన తీర్మానాన్ని గౌరవించడం భారత సమాఖ్య వ్యవస్థను, భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేస్తున్నదని తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) సవరణ బిల్లు 2026కు ఎంపీ వద్దిరాజు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.