MP Ravichandra | న్యూఢిల్లీ : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది అని ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక దిక్కుతోచని స్థితిలో రేవంత్ రెడ్డి మంత్రిమండలిని, పార్టీ ఎమ్మెల్యేలను, బీసీ సోదరులను వెంటబెట్టుకుని వచ్చి జంతర్ మంతర్ వద్ద డ్రామా చేస్తుండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలు, డ్రామాతో ఏ మాత్రం లాభం లేదు, బీసీలకు ఒరిగేదేమీ ఉండదు అని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో మా న్యాయమైన వాటా కోసం, హక్కుల సాధనకు ఇటువంటి ధర్నాలు,ఉద్యమాలు ఎన్నో చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలోనే మహానేత కేసీఆర్ మహిళలు, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపారు. బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందంటే, సముచిత గౌరవం దక్కిదంటే అది కేసీఆర్ సుపరిపాలనలోనే అని పేర్కొన్నారు. మోసపు మాటలు చెప్పి, 432 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుండు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మున్నూరు కాపు, ముస్లిం, లంబాడ, రజక, యాదవ్, కుర్మ కులాల వారికి చోటు లేకపోవడం బాధాకరం. రేవంత్ రెడ్డి ఆదరాబాదరాగా బీసీ కులాల కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఏడాదిన్నర పూర్తయినా కూడా అణా పైస విడుదల చేయలే అని మండిపడ్డారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాలలో 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉంటే రాహూల్ గాంధీ పార్లమెంటులో గళమెత్తాలి, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలి. లోకసభ, రాజ్యసభల్లో కలిపి కాంగ్రెస్, ఇండియా కూటమికి 300 మందికి పైగా సభ్యులు ఉన్నారు, కేంద్రాన్ని ఒప్పించి బీసీ బిల్లు పెడితే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుంది, రిజర్వేషన్స్ కు చట్టబద్ధత లభిస్తుంది అని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.