హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ‘తెలంగాణ రైజిం గ్’ నినాదం గాలి మాటలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం వికసించడం లేదని, ఆర్థికంగా మునిగిపోతున్నదని విమర్శించారు. ఒకప్పుడు ధీమాగా ఉన్న రాష్ట్ర ఖజానా రేవంత్‌రెడ్డి అసమర్థత వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు.
మిగులు బడ్జెట్ నుంచి భారీ లోటుకు తెలంగాణ రాష్ట్రం పడిపోయిందని ఆరోపించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో రూ.2.29 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కట్టుకథలు చెప్పిందని, తీరా చూస్తే రూ.1.81 లక్షల కోట్లు మాత్రమే సమకూరిందని శ్రవణ్ ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా భూముల ద్వారా కేవలం 5.54% ఆదాయమే రావడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నదని విమర్శించారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోవడమే దీనికి నిదర్శనమని పేరొన్నారు. మద్యం దుకాణాలు జనంతో కిటకిటలాడుతున్నా, ఎక్సైజ్‌శాఖ ఆదా యం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. దీనివెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సుమారు 5,200 కోట్ల ఆదాయాన్ని మద్యం సిండికేట్లు దారి మళ్లించాయని ఆరోపించారు. బడ్జెట్లో రూ.2,738 కోట్ల మిగులు ఉంటుందని నమ్మించి, ఏడాది చివరలో 9,235 కోట్ల రెవెన్యూ లోటును మిగిల్చారని ఆరోపించారు.