హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తే అడుగడుగునా అడ్డకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో బీసీ సంఘాలతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ప్రకటించినట్టు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సగానికి పైగా బీసీ జనాభా ఉంటే కేవలం 42 శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన కల్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు పెంచకుంటే నిరసన ప్రదర్శనలు చేపడతామని స్పష్టంచేశారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇచ్చిన హామీల ఊసెత్తడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన బీసీలను ఆ పార్టీ మోసం చేస్తున్నది. బడ్జెట్లో ఏటా బీసీల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది.
– ఎమెల్సీ కవిత
సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా అన్ని బీసీ సంఘాలతో జనవరి 3న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. సభకు రాష్ట్రంలోని అన్ని బీసీ ఉపకులాల వారు హాజరవుతారని చెప్పారు. ఇందిరా పార్కు సభ ద్వారా బీసీల బలమేంటో చూపిస్తామని స్పష్టం చేశారు. బీసీ సంఘాలతో శుక్రవారం నిర్వహించిన సమావేశం కేవలం ట్రైలర్ మాత్రమేనని, జనవరి 3న అసలైన సినిమా చూపిస్తామని వెల్లడించారు. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి బీసీల సత్తా చూపించబోతున్నామని చెప్పారు. సమావేశానికి 40కి పైగా బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
తెలంగాణ జనాభాలో సగానికి పైగా బీసీలుంటే.. కేవలం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తమని ఏ ప్రాతిపదికన ప్రకటించిండ్రు? కాంగ్రెస్ చెప్పిన 42 శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నరు. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు పెంచకుంటే జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడుతం.
– ఎమెల్సీ కవిత
కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేసిన యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని కవిత డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, మేర కులస్థుల దుకాణాలకు కేసీఆర్ హయాంలో ఉచిత విద్యుత్తు అందించారని, కాంగ్రెస్ రాగానే దాన్ని నిలిపివేయడంతో వారికి ఆర్థిక భారం పడిందని చెప్పారు. వెంటనే ఉచిత విద్యుత్తుతను పునరుద్ధరించాలని, అన్ని బీసీ ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి భవనాలు నిర్మించాలని, ఉచిత చేప పిల్లల పంపిణీని తిరిగి ప్రారంభించి, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజ్ కులాన్ని బీసీ ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు.
బీసీ కులాల్లోని సంచార జాతులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేయాలని, సబ్సిడీలతో రుణాలు మంజూరు చేయాలన్నారు. బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేసి యువతకు ఉపాధి కల్పించాలని, జ్యోతి రావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ మాదిరిగానే బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.