MLC Kavita : ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కాదని, అనుముల ఇంటెలిజెన్స్ (Anumula Intelligence) అని, ఈ అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kalwakuntla Kavita) అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై కవిత మంగళవారం ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్‌తోనే రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు.
అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని కవిత అన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ పని అని విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్‌ను వాడి కులగణనను తప్పదోవ పట్టించారని, బీసీకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. సర్వే వివరాలను అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారట అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్సైట్లో పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఎందుకు లేదని కవిత ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ ఆ వివరాలు వెల్లడించలేదని అన్నారు. ఆ వివరాలను వెల్లడించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని, అందుకు తాము కూడా కలిసి వస్తామని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతలలాగా తాము ఢిల్లీలో దొంగ దీక్షలు చేయబోమని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షకు కూర్చుంటామని అన్నారు.
చట్టసభలు బిల్లులను ఆమోదించి నాలుగు వారాలైందని, ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఆ బిల్లులు గవర్నర్ వద్దనే పెండింగ్‌లో ఉన్నాయా.. లేదంటే రాష్ట్రపతికి పంపించారా..? అని నిలదీశారు. బిల్లుల ఆమోదం తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారని, కానీ ఇప్పటివరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని అరోపించారు. బీజేపీతో రేవంత్‌రెడ్డికి లాలూచీ ఉన్నదని, బీజేపీని కాపాడటం కోసమే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని ఆరోపణలు చేశారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి బదులు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని, ఆ ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఊదరగొట్టారని, కానీ చివరికి ఆయన రాలేదని కవిత చెప్పారు. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడారని, ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అన్నారు. రేవంత్ సర్కారుకు చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టాలని,
ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే అని, ఆయన తనకు గురువని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలే అని, కులవివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని, అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్ఫూర్తి పొందుతుందని కవిత అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని, ధైర్యంగా ముందుకే వెళ్తాము తప్ప, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
ఏప్రిల్ 11న పూలే విగ్రహంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని అన్నారు. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించామని, ఇది తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీఆర్ఎస్ పార్టీ విజయమని చెప్పారు.