హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్నది గ్రామ స్వరాజ్యమా? బూతు సామ్రాజ్యమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. నూతన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ తెచ్చేవిధంగా ఉన్నదని విమర్శించారు. బూతుల విషయంలో ముఖ్యమంత్రి తన పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం లేఖ రాశారు. గ్రామ స్వరాజ్యానికి పునాదైన పంచాయతీ వ్యవస్థకు నాయకత్వం వహించాల్సిన ముఖ్యమంత్రి.. బూతులు మాట్లాడటం, బెదిరింపులకు దిగడం, హింసాత్మక పదజాలం ఉపయోగించడం, సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ‘సర్పంచ్‌లను ఉద్దేశించి చేసిన ప్రసం గం.. తమరి బూతు భాష ..గ్రామ స్వరాజ్యానికి మార్గదర్శకత్వమా? బూతుల సామ్రాజ్యానికి శిక్షణ శిబిరమా?’ అని ఎద్దేవా చేశారు.
తోలు తీస్తా.. పేగులు తెంచుతా..
సర్పంచ్ల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. 73వ రాజ్యాంగ సవరణ ప్ర కారం పంచాయతీలకు కల్పించిన 29 అధికారులు, నిధులు, విధులు, అధికారులతో సమన్వయం, గ్రామాభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేయాల్సిందిపోయి, ‘తోలు తీస్తా.. పేగులు తెంచుతా’ వంటి వీధిరౌడీ భాష మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కష్టపడి ఎదిగినవారికి శ్రమ విలువ తెలుస్తుందని తెలిపారు. లగచర్లలోని అమాయక గిరిజన రైతుల భూములు లాక్కోవడం, వారిని జైళ్లకు పంపించడం ఏ నైతికత అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, రైతుబంధు, రుణమాఫీ అమలుకాక ప్రజలు, రైతులు కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారని దాసోజు పేర్కొన్నారు.