BRS Party | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్.. బీజేపీలు ఢిల్లీలో కుస్తీ చేస్తూ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ బాహాటంగానే ఒప్పందం చేసుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్పై దాడి చేస్తున్నాయని తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోరుట్ల ఎమ్మెల్యే కే సంజయ్‌తో కలిసి మాట్లాడారు. రెండు పార్టీల మైత్రి అసెంబ్లీలో బట్టబయలైందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని చెప్పారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఢిల్లీలో కేంద్రం ఇచ్చిన అనుమతులను తప్పుబడుతున్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యేలు డీలింగ్ పెట్టుకొనే బీఆర్ఎస్ను విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే కే సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ హటావో దేశ్ కో బచావో అని ప్రధాని మోదీ అక్కడ అంటారని, ఇక్కడ కాంగ్రెస్‌ను కాపాడండి రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించండి.. అన్న చందంగా బీజేపీ వ్యవహిరస్తున్నదని మండిపడ్డారు.