Padi Kaushik Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ కరువైందని, ఇలాంటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శంభీపూర్ రాజుతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసుల తీరుపైన, కాంగ్రెస్ ప్రభుత్వంపైన, సీఎం రేవంత్‌రెడ్డిపైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కౌశిక్‌రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీశ్‌రావు ఆదేశాల మేరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు శంబీపూర్ రాజు.. ఇవాళ (శుక్రవారం) అరికెపూడి గాంధీ నివాసంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. అయితే మేం పిలుపునిచ్చిన తర్వాత పోలీసులు.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఆఖరికి నేను, శంభీపూర్ రాజు ఇద్దరం వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెబుతున్న అరికపూడి గాంధీని కలిసి కేసీఆర్ దగ్గరికి తీసుకువద్దామనుకున్నాం. కానీ నన్ను రాజు ఇంట్లోనే నిర్బంధించారు’ అని చెప్పారు.
‘నిన్న పోలీసులు అరికపూడిగాంధీకి దగ్గరుండి, ఎస్కార్ట్ ఇచ్చి, ఆయన తీసుకొచ్చిన గూండాలతో నన్ను చంపించే ప్రయత్నం చేశారు. ఎందుకు అలా చేశారని పోలీసులను నేను అడుగుతున్నా. నాపై దాడికి వచ్చిన 30, 40 మందిని సైబరాబాద్ పోలీసులు ఆపలేకపోయారా..? రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వ్యవహారశైలి గురించి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యేకే ఇక్కడ రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి..? దీనికి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.