KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు 300 మంది కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో చేరారు.
దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవు. చిత్తశుద్ధి గల్ల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదు. ఈ సన్నాసులకు ప్రభుత్వం నడపడం చేతకాదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపండం.. పదవులు కాపాడుకోవాలనే సోయి తప్ప ఇంకోటి లేదు. చివరకు కేసీఆర్ను తిట్టాలి అదే వారి పని అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్లో తెలంగాణలో అప్పులు ఎంత అని ప్రశ్న వేసిండు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అని కేంద్రం చెప్పింది. అందులో కేసీఆర్ రాకంటే ముందు 72 వేల కోట్ల అప్పు ఉంది. ఆయన వచ్చిన తర్వాత 2 లక్షల 80 వేల కోట్ల అప్పు చేసిండు. ఇది మాత్రమే అప్పు అంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టంగా చెప్పింది. అయినా కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదు. ఒకడు ఆరు లక్షలు అంటడు.. ఇంకొకడు ఏడు లక్షలు అంటడు. ఇంకోడు ఎనిమిది లక్షలు.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు.. ఆధారం, ప్రామాణికం, పత్రం అడిగితే లేదంటరు. ఉపన్యాసాలు అదరగొట్టాలి.. మీడియా మేనేజ్మెంట్ చేసుకోవాలి.. ఇదే కాంగ్రెస్ నేతల పని. వారి మీదికి దృష్టికి రాకుండా.. డైవర్షన్ గేమ్ ఆడుతున్నారు. కాళేశ్వరం, ఫార్ములా రేస్, విద్యుత్ అంశాల మీద సొల్లు పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చే పని చేయలేదు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
పంచాయతీ ఎన్నికలు అయినా, ఢిల్లీ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోవాలి. చిన్నచిన్న సమస్యలు ఉంటాయి.. వాటిని పకక్కన పెట్టాలి. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. ప్రజలు ఇవాళ కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే.. మన మధ్యన ఒక పెద్దాయన ఉంటే ఆయన విలువ తెలియదు. ఆయన ఆ పోజిషన్లో లేనప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా చీకటిని చూస్తనే వెలుగు విలువ తెలుస్తుంది. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది. ఇవాళ గాడిదులు ఎవరైతే ఉన్నారో వారిని చూసిన తర్వాత కేసీఆర్ విలువ ప్రస్పుటంగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని రైతులు బాధపడుతున్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం ఇవ్వడం లేదు.. చివరకు ఇనుము కూడా ఇవ్వరు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు. ఇది దండుపాళ్యం బ్యాచ్.. బంగారం ఇచ్చే బ్యాచ్ అసలే కాదు. ఒక్కొక్క వర్గాన్ని చైతన్యవంతం చేసి.. గెలుపు దిశగా పయనించాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.