Harish Rao | హైదరాబాద్ : వరదల మీద మాట్లాడుదామని అంటే.. వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రెండే రోజులు అసెంబ్లీ జరిపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోవాలని చూస్తుందని ఆయన ధ్వజమెత్తారు. బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేసిన హరీశ్‌రావు.. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు.
వరదలు, ఎరువుల మీద చర్చించాలని బీఏసీ సమావేశంలో మేం కోరాం. కానీ ఆ రెండింటి మీద చర్చించరట. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది. వరదలు, యూరియా కొరతపై మాట్లాడాలని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. ఈ రెండు అంశాలపై మాట్లాడాలని మేం కోరాం. వీటితో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. అంటు రోగాల మీద, గురుకులాల్లో కనీస సౌకర్యాలపై, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై, ఫోర్త్ సీటి పేరు మీద జరుగుతున్న అక్రమాలు.. సీఎం కుటుంబ సభ్యుల పాత్రపై, ధాన్యం కుంభకోణంపై.. బాధ్యులపై, ప్రభుత్వ ఉద్యోగుల టీఏ, డీఏలు, పీఆర్సీపై, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై, హైడ్రా కూల్చివేతలు పేదలు పడుతున్న భాదలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలపై చర్చించాలని కోరాం. వీటికి ప్రభుత్వం అంగీకరించలేదు. దురదృష్టం ఏంటంటే రెండే రోజులు అసెంబ్లీ జరుపుతామని అంటున్నారు. అంటే ఇవాళ రేపు, ప్రజా సమస్యల మీద చర్చించకుండా సభను వాయిదా వేసుకొని పారిపోతున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
వరదల మీద మాట్లాడడుదాం అంటే అది ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందాం అంటున్నారు. ఎరువులు, రైతుల మీద మాట్లాడుకుండాం అంటే తొందర ఏముంది.. మెల్లగా మాట్లాడుదాం అంటున్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైంది ఏముంటుంది..? వరద బాధితులు కాక ప్రధాన ఎంజెండా ఏముంటుంది..? ఎరువుల కొరత, వదరలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వ ధోరణి చూస్తే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పెట్టి బురద రాజకీయాలకు పాల్పడే ఆలోచనలో కనబడుతున్నారు. దాని మీద చర్చకు సిద్ధం.. పీపీటీకి అవకాశం ఇవ్వండి.. ఒక్క రోజు కాదు నాలుగు రోజులు మాట్లాడుకుందాం అని చెప్పాం. కానీ కష్టాల్లో ఉన్న రైతులు, వరద బాధితులపై మాట్లాడాలంటే ముందుకు రావడం లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
రేపు ఒక్క రోజే బీసీ బిల్లు, కాళేశ్వరం రిపోర్టుపై చర్చించి.. తర్వాత అసెంబ్లీ వాయిదా వేసుకుని పోతారట. ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ఎరువుల మీద చర్చించడానికి, వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రానందుకు వాకౌట్ చేశాం. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలి. రేపటి ఎజెండా కూడా చెప్పడం లేదు.. రాత్రి 10కి చెప్తారట. మరి ఎప్పుడు ప్రిపేర్ కావాలి. ప్రజాపాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా..? ఎజెండా నిర్ణయించకపోవడమేనా..? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అర్థంపర్థం లేకుండా బీఏసీ సమావేశం జరిగింది. కేవలం బురద రాజకీయాలే తమకు ప్రాధాన్యత అన్న ధోరణిలో ప్రభుత్వం ఉందని హరీశ్‌రావు మండిపడ్డారు.