హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : మజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల జగదీశ్‌రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని పేర్కొన్నది. సస్పెన్షన్‌పై సభలోని అన్ని పార్టీ ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం గాని, బీఆర్ఎస్ తరఫున వివరణ గాని, చివరికి సస్పెన్షన్‌కు గురైన జగదీశ్‌రెడ్డి నుంచి గాని వివరణ తీసుకోకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని ఆరోపించింది.
శనివారం బీఆర్ఎస్ శాసనసభాపక్షం నుంచి మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందరెడ్డి, సుధీర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిశారు. సస్పెన్షన్‌పై నిర్ణయాన్ని పునఃపరిశీలించి దాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై పునరాలోచించాలని, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పీకర్‌ను మాజీ మంత్రి హరీశ్ కోరారు. శనివారం అసెంబ్లీ ప్రారంభంకాగానే ఆయన మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావించారు. జగదీశ్‌రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించలేదని, స్పీకర్‌ను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడలేద ని, సస్పెండ్‌చేసే ముందు జగదీశ్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.