హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తేతెలంగాణ): విద్యారంగంపై కాంగ్రెస్ సర్కారుకు పట్టింపులేదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయని ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఆరువేల బడులు మూసివేసేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం, ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసిందని విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు.
విద్యారంగాన్ని ఉద్ధ్దరిస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 1913 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లతో పాటు 10 మందిలోపు విద్యార్థులున్న నాలుగు వేల పాఠశాలలు మూతపడే ప్రమాదమున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గురుకులాల్లోనూ విద్యార్థుల నమోదు తగ్గినా ఆత్మపరిశీలన చేసుకోకపోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ హయాంలో వెయ్యికి పైగా గురుకులాలు, 1400 జూనియర్, 40కిపైగా డిగ్రీ , నాలుగు లా, ఐదు పీజీ కాలేజీలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందించారని గుర్తు చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థులకు మంచి భోజనం పెట్టారన్నారు. కానీ, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆరువేల స్కూళ్లు మూతపడుతున్నాయని దుష్ప్రచారం సాగించారని విమర్శించారు. ప్రతి విద్యార్థికీ రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని, ప్రతి గ్రామానికీ ప్రైమరీ స్కూల్, రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, మండలానికి జూనియర్ కాలేజీ, నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఏడాదైనా ఉలుకుపలుకులేదని మండిపప్డారు.