వీపనగండ్ల, డిసెంబర్ 17 : సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫలితాలు తారుమారు అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ చేపట్టాలని ధర్నా చేపట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో బుధవారం చోటు చేసుకున్నది. మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా కల్వరాల గ్రామంలో 2,967 ఓట్లు పోలయ్యాయి. కౌటింగ్లో మాత్రం 2,897 ఓట్లు మాత్రమే లెక్కకు వచ్చినట్టుగా గుర్తించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్లో తక్కువ ఓట్లు రావడంతో రీకౌంటింగ్ చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రీకౌంటింగ్ చేపట్టే వరకు ధర్నా విరమించబోమని బీఆర్ఎస్ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు.
ములుగు, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో సర్పంచ్ పదవిని రద్దు చేయాలని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన చిక్కుల రాములు బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలో నిలిచినట్టు తెలిపారు. ఈ నెల 14న ఎన్నికలు జరిగాయని, కౌంటింగ్ రెండు గంటలకు అని చెప్పి తనను పోలింగ్ కేంద్రం బయటే ఉంచారని, చివరికి 3:30 గంటలకు లోపలికి పిలిచారని వెల్లడించారు. ఓట్లు లెక్కించి 9 ఓట్లతో తాను గెలుపొందినట్టు అధికారులు మౌఖికంగా ప్రకటించారని రాములు పేర్కొన్నారు. అంతలోనే 10నిమిషాలు కరెంట్ కట్ చేసి ఓట్ల లెక్కింపు తారుమారు చేశారని ఆరోపించారు.