BRS | ఖమ్మం, అక్టోబర్ 28 : బీఆర్ఎస్ను, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేని సీఎం రేవంత్‌రెడ్డి.. చౌకబారు పనులకు తెర లేపారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. అందులో భాగంగానే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన కుటుంబ వేడుకను రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన గృహ ప్రవేశ వేడుకను రేవ్పార్టీగా పేర్కొనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ మంత్రులు, నాయకుల ఇళ్లల్లో విదేశీ మద్యం లేదా?’ వారు విదేశీ మద్యం తాగరా? అని ప్రశ్నించారు.
సూర్యాపేట, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ) : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే వారి బంధువులను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో పోలీసులు సోదాలు, కేటీఆర్ ఇంటిపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో బడుగుల మాట్లాడుతూ.. కేటీఆర్ బంధువుల గృహప్రవేశ వేడుకను రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. పోలీసుల ఎఫ్ఐఆర్ మొత్తం అబద్ధ్దాల పుట్ట అని, అధికారులు ఇచ్చిందొకటి, వాళ్లు చేసిందొకటని మండిపడ్డారు.
భద్రాచలం, అక్టోబర్ 28 : మాది ప్రజాపాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ సంప్రదాయం ప్రకారం దావత్ చేసుకుంటే దానిని రేవ్ పార్టీగా చిత్రీకరించి రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
బెల్లంపల్లి/చెన్నూరు, అక్టోబర్ 28: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై బురదజల్లేందుకు ఆయన బావమరిదిపై డ్రగ్స్ కేసు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాక్ష అని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే జన్వాడ ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీలు జరిగాయంటూ ప్రభుత్వం పోలీసులతో తనిఖీలు చేయించి సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్వీ నాయకులు, చెన్నూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.
జగిత్యాల, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పది నెలల పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నది.. ఎప్పుడు ఏమవుతుందోనని తెలియక ప్రజలు భయపడే పరిస్థితి నెలకొన్నది..’ అని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ బావమరిది కుటుంబసభ్యులతో కలిసి దావత్ చేసుకుంటే అక్రమ అరెస్టులు చేయించడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు.
జగిత్యాల, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి బండ్ సంజయ్, ఆయన కొడుక్కి డ్రగ్స్ పరీక్షలు చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ బావమరిది గృహప్రవేశ కార్యక్రమ విందు ఏర్పాటుచేసుకుంటే దానిని రేవ్పార్టీగా చిత్రీకరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. కుటుంబ విందుకు, రేవ్‌పార్టీకి తేడా తెలియని సీఎం ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. రేవ్‌పార్టీ అంటూ సీఎం తప్పుడు ఆరోపణలు చేసి కేసులు పెడితే.. కేంద్ర మంత్రి బండి డ్రగ్స్ అంటూ కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు.
తిమ్మాపూర్, అక్టోబర్ 28 : రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చలేక.. హైడ్రాపై వస్తున్న వ్యతిరేకతను మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చావైనా, బతుకైనా పండుగలా చేసుకోవడం తెలంగాణ సంస్కృతి అని పేర్కొన్నారు. కేటీఆర్ బావమరిది గృహప్రవేశ దావత్‌ను రేవ్పార్టీగా చిత్రీకరించి కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.