Bhuvanagiri | యాదాద్రి భువనగిరి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఎక్కడ చూసినా భారీగా మోహరించిన భద్రతా బలగాలు.. ఎక్కడికక్కడ బారికేడ్లు.. గుర్రాలపై పోలీసుల చక్కర్లు.. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు.. పట్టణంలోకి వచ్చేవాళ్లపై ఆంక్షలు.. గులాబీ దళం ఆందోళనలు.. బీఆర్ఎస్ నేతలు కనిపిస్తే అరెస్టులు.. ఇదీ ఆదివారం భువనగిరిలో కనిపించిన ఉద్రిక్త దృశ్యాలు. భువనగిరిలో బీఆర్ఎస్ ఆందోళనలతో పోలీసుల ఆంక్షలు, అరెస్టులతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అట్టుడికింది. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడటంతో గులాబీ పార్టీ ఆదివారం మహాధర్నాకు పిలుపునిచ్చింది.
ఉదయం నుంచే పోలీసులు మహాధర్నా నిర్వహించే ప్ర దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. వినాయక చౌరస్తా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జూనియర్ కాలేజీ, ప్రిన్స్ కార్నర్ జగదేవ్‌పూర్ చౌరస్తా, బస్టాండ్‌తో పాటు పట్టణంలోని చాలాచోట్ల ఆంక్షలు విధించారు. భువనగిరి చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి రావాలంటే మూడెంచల భద్రతను దాటాల్సిన దుస్థితి కల్పించారు. ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతనే పట్టణంలోకి అనుమతించారు. పండుగ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నేతలతోపాటు హైదరాబాద్‌లో ఉంటున్న కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఘట్కేసర్ వద్ద అదుపులోకి తీసుకున్నా రు. నాగోల్‌లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. రామన్నపేటలో రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీబీనగర్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ వనస్థలిపురంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ క్యామ మల్లేశ్‌ను, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, నల్లగొండలో మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్, యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావును భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. యాదా ద్రి జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలోని జూనియర్ కాలేజీ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించారు. వివేకానంద జయంతిలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రాగా ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైళ్ల శేఖర్‌రెడ్డిని హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్‌కు, కర్నె ప్రభాకర్‌ను బీబీనగర్ పీఎస్‌కు తరలించారు. వినాయకచౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు వెంకటేశ్వర్ రెడ్డి, సందీప్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రిన్స్ కార్నర్ వద్ద కూడా బీఆర్ఎస్ బృందం ఆందోళన నిర్వహించింది. ఆందోళనకారులను అరెస్టు చేసి, బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి స్టేషన్లకు తరలించారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు రివర్స్‌లో కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై శనివారం యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేసిన విషయం విదితమే. ఆ దాడిని నిరసిస్తూ భువనగిరిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పలువురు నేతలపై కేసులు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.