BRS : ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఇది దేశ విద్యావ్యవస్థలోనే అతిపెద్ద స్కామ్ అని అన్నారు. మొత్తం 21,093 మంది గ్రూప్-1 పరీక్షలు రాస్తే 21,103 మంది ఫలితాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పది మంది అదనంగా ఎక్కడి నుంచి వచ్చారని నిలదీశారు. కరీంనగర్లో మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్ పాడి మాట్లాడారు.
ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్ష రాశారని ఒకసారి, 10 రాశారని మరోసారి టీజీపీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిందని, ఇందులో ఏది నిజం, ఏది అబద్దమని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రిలిమ్స్‌కు ఒక హాల్ టికెట్, మెయిన్స్‌కు మరో హాల్ టికట్ ఇచ్చిన సందర్భం దేశ చరిత్రలో లేదని మండిపడ్డారు. ఈ అంశం టీజీపీఎస్సీ చేతిలో ఉంటుందని సమర్ధించుకుంటున్నారని, అక్కడే స్కామ్‌కు ఆస్కారం ఏర్పడిందని విమర్శించారు.
ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన 654 మందికి సేమ్ మార్కులు ఎలా వచ్చాయని పాడి ప్రశ్నించారు. కోఠిలోని ఓ సెంటర్లో పరీక్షలు రాసిన 1,497 మందిలో 75 మంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారని, మిగతా 25 సెంటర్లలో 10,135 మంది పరీక్షలు రాస్తే కేవలం 65 మందే సెలెక్ట్ అయ్యారని ఇదెలా సంభవమని నిలదీశారు. ఉర్దూలో పరీక్షలు రాసిన 9 మందిలో ఏడుగురికి ఉద్యోగాలు ఎలా వచ్చాయని అడిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలుకు మల్టీజోన్‌లో నంబర్ 1 ర్యాంకు, స్టేట్ లో 206వ ర్యాంకు వచ్చిందని అన్నారు.
పరీక్ష రాసిన వారికంటే అదనంగా వచ్చిన 10 మందిలో రాములు నాయక్ కోడలు ఉన్నదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులు ఈ విషయమై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నాయని, అందుకే బీజేపీ నోరు మెదపడం లేదని ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చిన్నచిన్న పరీక్షల పేపర్లు లీకైనాయని ఎగిరెగిరి దుంకిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. ఇపుడు ఇంత పెద్ద స్కామ్ జరిగినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సీఎం నుంచి ఆయనకు ముడుపులు ముడుతున్నాయని పాడి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేని విమర్శించారు. గ్రూప్-1 అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాతో సహా బయటపెట్టామని చెప్పారు. దీనిపై విచారణ జరిపించి కాంగ్రెస్ నాయకులు తమ నిజాయితీని నిరూపించంకోవాలని డిమాండ్ చేశారు.