దేవరుప్పుల, జూన్ 22: తెలంగాణ కోసం అహరహం శ్రమించి, ఉద్యమ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేసిన తెలంగాణ సిద్ధ్దాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ చిరస్మరణీయుడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. సోమవారం అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణవాసులు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ విశ్లేషకుడు వీ ప్రకాశ్‌తో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణ వెనుకబాటుకు జరుగుతున్న అన్యా యం, దోపిడీపై మొదటి నుంచీ పోరాడిన గొప్పవ్యక్తి జయశంకర్ సార్ అని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే తాను ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని, టీడీపీలో ఉన్నా తెలంగాణ ఉద్యమపాత్ర ఉండాలని తనకు మార్గదర్శకత్వం చేశారని అన్నారు.
ఇదే స్ఫూర్తితో చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించడంలో కీలక భూమిక పోషించినట్టు చెప్పారు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తెలంగాణకు అనుకూలంగా సంతకం చేయించగా, నేటి సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేయలేదని గుర్తుచేశారు. జయశంకర్ సార్ లేకపోయినా తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేశారని తెలిపారు. సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేశారని అన్నారు. మిషన్ భగీరథతో తాగునీరు, మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, పింఛన్లు భారీగా పెంపులాంటి అనేక పథకాలు అమలు చేసి అనతికాలంలోనే దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలిపారని గుర్తుచేశారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని కరువుకాటకాల్లోకి నెట్టారని విమర్శించారు. రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు.