కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తీగలబంజర గ్రామంలో రైతు భుక్యా శ్రీనుకు చెందిన మూడెకరాల్లో ఎండిపోయిన మక్కజొన్న పంటను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే సర్కారు చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.
– కొణిజర్ల
రైతుపై కనికరం చూపని కాంగ్రెస్ సర్కారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీరాజరాజేశ్వర జలాశయంలో నీళ్లు లేక తేలిన శాభాష్‌పల్లి రోడ్డు, బీటలు వారిన భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీరు లేక రైతులు తల్లడిల్లుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.
– రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/బోయినపల్లి
ఇది అసమర్థ ప్రభుత్వం తెచ్చిన కరువు
వందరోజుల కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఇది సహజంగా వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని ఆయన విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే బండ్ల ఎండిన పంటలను పరిశీలించారు. రైతులు ఎమ్మెల్యేకు తమ గోడును వినిపించి ఆదుకోవాలని వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, కనీసం సమీక్ష కూడా చేయడం లేదని మండిపడ్డారు.
– కేటీదొడ్డి