బంజారాహిల్స్, జూలై 5: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్‌లో నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేయడంతోపాటు తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ఐడ్రీమ్స్ చానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చాడ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గతనెల 24న ఐడ్రీమ్స్ తెలుగు చానల్లో యాంకర్ సౌమ్యారెడ్డి, న్యాయవాది అరుణ్‌కుమార్‌ను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా అనేక అబద్ధాలు, నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
కేసీఆర్ 1990నుంచే ఫోన్ ట్యాపింగ్ చేయించారని, 40వేల ఫోన్లను ట్యాప్‌చేసి ఫౌంహౌస్‌లో భారీ స్క్రీన్ పెట్టుకుని విన్నారని.. అవాకులు చవాకులు పేలారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టీఆర్పీ రేటింగ్స్ కోసం పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఇతర బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ సౌమ్యారెడ్డి, న్యాయవాది అరుణ్‌కుమార్‌తో పాటు ఐడ్రీమ్స్ చానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి, గాంధీనాయక్, మధిర నియోజకవర్గం మాజీ ఇన్చార్జి బమ్మెర రామ్మూర్తి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కుర్వ పల్లయ్య తదితరులు ఉన్నారు.