హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో దుర్మార్గాలు, అరాచకాలు, హామీల ఎగవేతలు తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగాక మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అడ్డదిడ్డంగా మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు.
సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అడ్లూరి లక్ష్మణ్ అబద్ధాల లక్ష్మణ్‌గా మారిపోయారని ఎద్దేవా చేశా రు. అసత్యాలు మాట్లాడిన అడ్లూరి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గురుకులాల్లో మరణాలపై అడ్లూరి ఎప్పుడైనా సమీక్షించారా? సీఎంతో ఎప్పుడైనా చర్చించా రా? అని నిలదీశారు. లక్ష్మణ్ దళితులకు ఏం చేశారో గుండెమీద చెయ్యివేసుకొని చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో దళితుల అభ్యున్నతికి ఖర్చు చేసిన నిధులు, కాం గ్రెస్ హయాంలో వెచ్చించిన నిధులపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. దమ్ముంటే స్థలం, తేదీ నిర్ణయించాలని సవాల్ విసిరారు.
గురుకుల టెండర్లలో 2 వేల కోట్ల స్కామ్
గురుకుల టెండర్ల ముసుగులో కాంగ్రెస్ పెద్దలు రూ.2 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. గురుకుల విద్యార్థులకు నాసిరకం దుస్తులు పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. పాముకాట్లు, విషాహారంతో 150 మంది పిల్లలు మరణించినా మంత్రి అడ్లూరికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే తాము చేసే ఆరోపణలకు అడ్లూరి లక్ష్మణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విభజిస్తామని చెప్పి ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. బడ్జెట్లో ఎస్సీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా దళితులకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నయాపైసా లోన్ ఇవ్వకుండానే పదవి నుంచి దిగిపోయారని చెప్పారు. కేసీఆర్ పాలనలో దళితుల సంక్షేమానికి రూ.96 వేల కోట్లు ఖర్చుచేశామని, 17 వేల ఎకరాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో సీఎం, మంత్రులు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని, పర్సంటేజీల పాలన నడుపుతున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రాబాబులకు వత్తాసు పలుకుతూ తెలంగాణకు తీరనిద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు.
పరికరాల టెండర్లలో అక్రమాలు: కేతిరెడ్డి
దివ్యాంగుల పరికరాలు, వాహనాల పంపి ణీ టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ అక్రమాలకు తెరలేపిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కమీషన్లు దండుకొని నాణ్యతలేని వాహనాలు కట్టబెట్టి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్డర్లు ఇస్తే కాంగ్రెస్ హయాంలో మాత్రం ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని నిప్పులుచెరిగారు. కమీషన్లలో మంత్రి అడ్లూరికి సైతం వాటా ఉన్నదని ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్లో వాసుదేవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 100 శాతం సబ్సిడీపై దివ్యాంగులకు పరికరాలు, వాహనాలు ఇచ్చామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
తెలంగాణ రాక ముందు ఉన్న 30 శాతం సబ్సిడీని 100 శాతానికి వర్తింపజేసిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని స్పష్టంచేశారు. అధికారం కోసం అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ దివ్యాంగులకు తీరని ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. ఆరువేల పింఛన్ ఇస్తామని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయడంలేదని విమర్శించారు. పింఛన్లు పెంచుడు దేవుడెరుగు.. 40 వేల పింఛన్లను రద్దుచేసిందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల్లోనూ దివ్యాంగులకు అవకాశం కల్పించకుండా మొండి చెయ్యి చూపిందని నిప్పులు చెరిగారు. ఎవరి పాలనలో దివ్యాంగులకు మేలు జరిగిందో చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. ఈ సవాల్‌కు మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.