కోల్‌సిటీ, నవంబర్ 6: అభివృద్ధి పేరిట రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలను ఇప్పటికైనా ఆపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కూల్చివేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌తో కలిసి బుధవారం రామగుండం బల్దియా కార్యాలయాన్ని ముట్టడించారు.
దీంతో వన్ టౌన్ పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకున్నది. స్థానిక ఎమ్మెల్యే లేదా కమిషనర్ అరుణశ్రీ వచ్చి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గంటకుపైగా జరిగిన ఆందోళనతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఆందోళనలో డిప్యూటీ మేయర్ అభిషేక్, కార్పొరేటర్లు బాదె అంజలి, జనగామ కవిత, గాదం విజయ, పెంట రాజేశ్, కుమ్మరి శ్రీనివాస్, ఐత శివ, పాముకుంట్ల భాస్కర్ పాల్గొన్నారు.
ఫర్టిలైజర్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ 30 మంది బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమేశ్ తెలిపారు.