హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన ఆరోపణలు నిరాధారమని పలువురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏమీ లేదని, రాజకీయ కక్షతో కేసులు పెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని బీసీ సంఘం నాయకుడు బొల్ల శివశంకర్ విమర్శించారు. ఉద్యమ సమయంలో ఆమె ఊరూరు తిరుగుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, బతుకమ్మను కాపాడితే.. బల్మూర్ గోడలు దూకుతున్నారని బీఆర్ఎస్ నేత ఎల్చాల దత్తాత్రేయ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిపై, రాష్ట్రం కోసం పాటుపడుతున్న వారి కుటుంబంపై ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కవితపై అవాకులు, చెవాకులు పేలుతున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నోరు జాగ్రత్త అని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్ఎస్వీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని ఇచ్చిన కాంగ్రెస్‌పై పోరాడి అసెంబ్లీలో బిల్లుపెట్టేలా కవిత కృషి చేశారని కొనియాడారు.