కోటపల్లి, మార్చి 19: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నది. సుమారు రూ.3 లక్షల కోట్లతో మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్లో పలు పథకాలు, సంక్షేమానికి కోతలు విధించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా (Mancherial) కోటపల్లిలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉండటంతో ముదస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపలు చేస్తున్నదని విమర్శించారు. గత బడ్జెట్లో అనేక పథకాలు, కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించినా, వాటిని వినియోగించలేదని, ఇదే తరహాలో ఈసారీ తూతూమంత్రపు కేటాయింపులే ఉండొచ్చంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాక సంక్షేమ పథకాలకు మెల్లమెల్లగా మంగళం పడుతున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.