నల్లగొండ: రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మించిన యాదాద్రి విద్యుత్ కేంద్రంతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇప్పటికే దామరచర్లను పూర్తిగా ఆదీనంలోకి తీసుకున్న పోలీసులు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ (BRS) నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్ రావును హౌస్ అరెస్టు చేశారు.
అదేవిధంగా నల్లగొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డితోపాటు పలువురు పట్టణ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక మిర్యాలగూడ, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో కూడా బీఆర్ఎస్ లీడర్లను మందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతె పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తామేం తప్పు చేశామని అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.