న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 7: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గురుకుల బాట పడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాలో పార్టీ నాయకులు గురుకులాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మెరుగైన భోజనం అందుతుందా అని ఆరా తీశారు. బీఆర్ఎస్ నాయకులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లోని గిరిజన గురుకుల పాఠశాల వెళ్లగా.. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నాయకులు అక్కడే బైఠాయించారు. ఆందోళనకు దిగిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్లకిష్టంపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బీఆర్ఎస్ నాయకులు సందర్శనకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. పాఠశాలలోకి వెళ్లిన మహిళలను బలవంతంగా బయటికి పంపారు. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో శనివారం చేపట్టిన బీఆర్ఎస్ గురుకుల బాటను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు.
మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించడానికి శుక్రవారం రాత్రి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను సిబ్బంది అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాల గేటు ఎదుట ధర్నా చేసి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెన్నూర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలై బీసీ (బాలుర) గురుకులాన్ని బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. భోజనాన్ని తిని రుచి చూశారు. నాణ్యతగా లేకపోవడంపై ప్రిన్సిపాల్ కేవీఎం ప్రకాశ్‌రావును ప్రశ్నించారు. లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలను బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నడిపల్లి విజిత్‌రావు సందర్శించారు. కిచెన్‌లో వంటకు ఉపయోగించే సామగ్రిని పరిశీలించారు. జైపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాజారమేశ్ సందర్శించారు. విద్యార్థుల సంఖ్య.. హాజరుశాతం గురించి ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదోతరగతి విద్యార్థుల గదిలోకి వెళ్లి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు తీసుకువస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.