జోగులాంబ గద్వాల : జిల్లాలోని గట్టు మండలం బల్గెర గ్రామంలో దిగంబర స్వామి జాతర ( Digambara Swamy Jatara) సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీల సందర్భంగా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోటీలను నిర్వహిస్తున్న గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడును ( Basu Hanmanth Naidu ) స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్టు ( BRS leader) చేశారు. ఆయన అరెస్టు నేపథ్యంలో పార్టీ నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.
హనుమంతు నాయుడు మాట్లాడుతూ గ్రామంలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా రైతు సంబరాలు నిర్వహిస్తే ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ హౌస్ అరెస్టులతో ప్రజాపాలన కొనసాగించలేరని మండిపడ్డారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక, రైతుల సంతోషం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బండ లాగడు పోటీలను ఆపడం సరికాదని అన్నారు.
ఎడ్ల బండలాగుడు పోటీలకు బ్రేక్
బండలాగుడు పోటీలను ఎట్టి పరిస్థితిలోనూ జరపరాదని జిల్లా పోలీస్ అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో గట్టు ఎస్సై కేటీ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు . పోటీలను జిల్లాలో ఎక్కడ జరగనీయమని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. గట్టు, కేటి దొడ్డి ,మల్లకల్ ఎస్సైలు కేటి మల్లేష్ , శ్రీనివాస్ ,నందికర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.