Lagcherla | లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నకు బేడీలా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు.
రైతు తనకు గుండె నొప్పి వచ్చిందన్నా ఈ పాలకుల గుండె కరగదా అని నిలదీశారు. ప్రజా పాలనలో లగచర్ల రైతుకు జరిగిన సన్మానమిదా అని ప్రశ్నించారు. ఫార్మాక్లస్టర్ పేరిట గిరిజన తండాల్లో మంటలు రాజేసి ఎదురుతిరిగిన రైతుల మీద అక్రమ కేసులు బనాయిస్తారా? అని మండిపడ్డారు. అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడబిడ్డలను వేధించిన సర్కార్‌కు అన్నదాత అంటే గౌరవం ఉంటుందా అని విమర్శించారు. భూమిని నమ్ముకుని బువ్వను అందించే రైతన్న మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమ ఇదేనా అని మండిపడ్డారు.
లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న హీర్యానాయక్ ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. గురువారం గుండె సమస్యరావడంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. సంకెళ్లు వేసి తీసుకురావడం భావ్యంకాదని గతంలో కోర్టులు తీర్పు చెప్పినా కూడా పోలీసులు రైతు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడం పట్ల పలువురు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.