బీసీలకు అత్యంత అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నాయకులు శుభప్రద్ పటేల్ విమర్శించారు. స్వాతంత్ర్యం అనంతరం బీసీలకు అన్యాయం చేసిన వారిలో నెహ్రూ మొదటి ద్రోహిగా మిగిలారని ఆరోపించారు. మండల్ కమిషన్ సిఫార్సులను కూడా కాంగ్రెస్ ఏళ్లపాటు అమలు కాకుండా అడ్డుకుందని విమర్శించారు.
కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం వాటా ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన బీసీలను మహేష్‌గౌడ్ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. బీసీలకు కాంగ్రెస్ చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అని విమర్శించారు.
బీసీ సీఎం చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే ఈ రోజే ఆ నిర్ణయం తీసుకోవచ్చని శుభప్రద్ పటేల్ అన్నారు. మహేష్గౌడ్ను సీఎం చేసినా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. జనగణనలో ఓబీసీ కాలమ్ ఎందుకు పెట్టలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడంపైనా ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ద్రోహం చేయడంలో ప్రధాన దోషులని శుభప్రద్ పటేల్ ఆరోపించారు. చేవెళ్ల బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ జనగణన కూడా తప్పుల తడకగా జరిగిందని విమర్శించారు.
రాష్ట్రంలో మరో 20, 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెబుతున్నప్పుడు బీసీ సీఎం ఎలా వస్తారని ప్రశ్నించారు.