హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా, సినిమా పరిశ్రమను కించపరిచేలా మాట్లాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి బజారు భాషపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆమె తీరును మహిళలే అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ‘ఖబర్దార్ బిడ్డా? నోరు జాగ్రత్త’ అని సురేఖను హెచ్చరించారు. మహిళా మంత్రులను శిఖండిలా అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణభవన్‌లో మాజీ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ తుల ఉమతో కలిసి బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు.
సినిమా పరిశ్రమలో ఉన్న మహిళలను కేటీఆర్‌కు అంటగడతారా? అని నిలదీశారు. ఇట్లాగే మాట్లాడితే కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. సినిమాలు నిర్మించిన సురేఖ, సినీ పరిశ్రమ మహిళలపై చులకనగా మాట్లాడటం తగదని హితవుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తున్నారని, ప్రజలంతా బీఆర్ఎస్ వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని, ఈ క్రమంలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను ఓర్వలేక కేటీఆర్‌పై సురేఖ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో కొండా సురేఖ ఏం మాట్లాడారో అందరికీ తెలుసని, ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలు స్పందించాలని కోరారు.అకలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సీఎం అసెంబ్లీలో అంటే మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల ఓ మహిళగా తాను సిగ్గుపడుతున్నానని మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని, మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జున కుటుంబాన్ని, సమంతను ఎన్నిసార్లు రోడ్డున పడేస్తారని ప్రశ్నించారు. సురేఖ నోరును యాసిడ్‌తో కడగాలని విమర్శించారు. కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, ఉరికిచ్చి కొడతామని హెచ్చరించారు. సురేఖపై పరువునష్టం దావా వేస్తామని చెప్పారు. హైడ్రాతో పడిపోతున్న గ్రాఫ్‌ను కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డి కొండా సురేఖ, సీతకతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి గాని, కేటీఆర్‌పై మాట్లాడితే.. నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
‘నువ్వేమైనా బ్రోకర్‌వా? ఓ మహిళవై ఉండి సినిమా పరిశ్రమలోని మహిళలను ఎలా కించపరుస్తవ్? ఇతర మహిళల పేర్లు ఎలా ప్రస్తావిస్తవ్?’ అని బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమ నిలదీశారు. కొండా సురేఖ చరిత్ర అందరికీ తెలుసని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఎవరో కామెంట్ పెడితే దొంగ ఏడుపులు ఎందుకు? దానికి కేటీఆర్‌పై ఆరోపణలు చేయడం ఎందుకు? అని నిలదీశారు. ట్రోల్ చేసిన వారిపై మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హైడ్రాతో ఇబ్బంది పడుతున్న ఆడబిడ్డల గోస కొండా సురేఖకు, సీతకకు కనిపించడం లేదా? అని నిలదీశారు.